భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ .. టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్ : అజారుద్దీన్‌పై హెచ్‌సీఏ కార్యదర్శి ఆరోపణలు

By Siva KodatiFirst Published Jan 17, 2023, 7:33 PM IST
Highlights

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ ఆజారుద్దీన్‌పై జనరల్ సెక్రటరీ విజయ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు జరగనున్న భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని వ్యాఖ్యానించారు.  
 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ)మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ ఆజారుద్దీన్‌పై జనరల్ సెక్రటరీ విజయ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడినని తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు. ఆన్‌లైన్ టికెట్లలోనూ గోల్ మాల్ జరిగిందని..ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతుంటే తనను సంప్రదించలేదని విజయ్ ఆనంద్ దుయ్యబట్టారు. మ్యాచ్ టికెట్లు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. 

కాగా.. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో వన్డే సమరానికి సిద్ధమవుతుంది. తొలి వన్డేకు  హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నది. ఈ మ్యాచ్  కు ముమ్మర  ఏర్పాట్లు చేస్తున్నట్టు   హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు  మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. మ్యాచ్ టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్ వేదికగా విక్రయించనున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 18న  కివీస్ తో తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో   మ్యాచ్ ను  ఆటగాళ్లు, ప్రేక్షకులు, అతిథులు ఆస్వాదించేలా నిర్వహిస్తామని చెప్పాడు. 

పేటీఎంలో ఇండియా - న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ టికెట్స్ అందుబాటులో వుంచినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మొత్తం 39 వేల టికెట్లను అందుబాటులో వుంచినట్లు వెల్లడించింది. ఈ నెల 16 వరకు టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. గతంలో జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనతో హెచ్‌సీఏ అప్రమత్తమైంది. మొదటి రోజు 6 వేల టికెట్స్ అందుబాటులో వుంచినట్లు పేర్కొంది. 

గతేడాది భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరిగిన చివరి టీ20 మ్యాచ్ సందర్భంలో  హెచ్‌సీఏ వ్యవహరించిన తీరుపై విమర్శలు తలెత్తాయి. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు తీసుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టికెట్లను అజారుద్దీన్ తనకు కావాల్సినవారికి అందజేశాడని, ప్రేక్షకులకు మాత్రం  బ్లాక్ లో రెట్టింపు రేట్లకు కూడా దొరకలేదని విమర్శలు వినిపించాయి. 

click me!