హీరో బాలకృష్ణ కేసులో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశాలు

By pratap reddyFirst Published Jan 26, 2019, 8:28 AM IST
Highlights

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ విషయంలో హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ విషయంలో హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. బాలకృష్ణ ఉదంతంలో తీసుకునే చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్ పై శుక్రవారం ఏసీజే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ నంద్యాలలో రోడ్‌షో నిర్వహించారని, ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న దానిపై పక్కా ఆధారాలున్నాయని, ఈ ఆధారాలను కూడా సమర్పించినా కూడా అధికారులు కేసు నమోదు చేయడం లేదని వాదించారు. ఇటువంటి విషయాల్లో చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారే ఫిర్యాదు చేయాలన్నారు. అయితే ఎన్నికల అధికారి తన విధులను నిర్వర్తించడం లేదని చెప్పారు. 

తరువాత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బాలకృష్ణ చర్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టం కిందకు రావని అన్నారు. అవి ఐపీసీ కిందకు వస్తాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

click me!