సజ్జలా ...సర్వనాశనం చేసావు కదయ్యా..: జగన్ ఇన్నర్ ఫీలింగ్ ఇదేనేమో..!!

By Arun Kumar P  |  First Published Aug 29, 2024, 10:57 AM IST

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమికి అనేక కారణాలున్నాయి. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు అనేది రాజకీయ వర్గాల్లో టాక్. ఆయన ఎలా కారణమయ్యారో చూడండి


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అర్థమైనట్లే వుంటాయి...కానీ అర్థంకావు. ప్రజలు నాడి తెలిసినట్లే వుంటుంది...కానీ తెలియదు. ప్రజలు ఎప్పుడు ఎవరిపక్షాన నిలుస్తారో ఊహించడం చాలా కష్టం. గత రెండు అసెంబ్లీ ఎన్నికలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో 175 కి 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైసిపి 2024 కు వచ్చేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఇదే సమయంలో గతంలో 23 సీట్లకు పరిమితమైన టిడిపి ఈసారి 135 (కూటమి 164) గెలుచుకుంది. ఇలా 175 కు 175 సీట్ల నినాదంలో ఎన్నికలకు వెళ్లిన వైసిపికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసిపి ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి. ప్రధాన కారణంగా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వుండేవారేనని స్వయంగా వైసిపి నాయకులే చెబుతున్నారు. మరీముఖ్యంగా మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసిపి పరిస్థితికి కారణమనే వాదన వైసిపిలో వుంది. ఇటు పార్టీలో, అటు పాలనలో ఆయన పెత్తనమే ...అసలు వైసిపి అధినేత వైఎస్ జగనా లేక సజ్జలా అనే అనుమానం కలిగేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

 వైఎస్ జగన్ కు పార్టీ నాయకుల మధ్య సజ్జలే... ఆనాటి సీఎం జగన్ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులకు మధ్య సజ్జలే వారధిగా వుండేవారు. అంటే వైఎస్ జగన్ వరకు వెళ్లాలంటే ముందు సజ్జలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదన్నమాట. ఆయన ఒప్పుకుంటేనే జగన్ ను కలవడం... లేదంటే లేదు. ఆ తర్వాత కూడా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అమలుచేయాల్సింది సజ్జలే. ఇలా పార్టీలో, పాలనలో సజ్జల చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లు వుండేది. ఇదే వైసిపి కొంప ముంచిందని...పార్టీని సర్వనాశనం చేసిందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. 

సజ్జల రామకృష్ణా రెడ్డి అనే అడ్డుగోడ వైఎస్ జగన్ కి పార్టీ నాయకులకు మధ్య దూరం పెంచింది. సీఎంగా జగన్ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదానికి సజ్జలపై ఆదారపడేవారు. దీంతో తమ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోడానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులను... పార్టీ పరిస్థితి గురించి చెప్పేందుకు వచ్చిన నాయకులను సజ్జలే డీల్ చేసేవారు. ఇలా పాలన, పార్టీ పరిస్థితి గురించి జగన్ కు తెలిసేది కాదు... దీంతో అంతా బాగానే వుందని భావించేవారని వైసిపి నాయకులు చెబుతున్నారు. అందువల్లే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఘోరంగా వున్నా 175 కు 175 సీట్లు సాధిస్తామనే ధీమాతో ఆయన వుండేవారని అంటున్నారు. సజ్జల అడ్డుగా వుండటంతో అసలు నిజాలు జగన్ చెవున పడేవికావని వైసిపి నాయకులు అంటున్నారు. 

ఇలా వైసిపి పార్టీని, వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ ను సజ్జల సర్వనాశనం చేస్తే ఆయన తనయుడు భార్గవ్ రెడ్డి పార్టీ సోషల్ మీడియాను నాశనం చేసాడని అంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయడంమానేసి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై దుమ్మెత్తి పోసేందుకే వైసిపి సోషల్ మీడియాను భార్గవ్ ఉపయోగించారు. ఇది  కూడా వైసిపిని దెబ్బతీసింది... ప్రజల్లోకి వైసిపి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో వెళ్లలేదు. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా పడింది. అంటే తండ్రీ కొడుకులు వైసిపిని ఈ పరిస్థితికి తీసుకువచ్చారని వైసిపి నాయకులు మండిపడుతున్నారు. 

గతంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇతర పార్టీల నాయకులు సకల శాఖా మంత్రిగా సంబోధించేవారు. వైసిపి ప్రభుత్వంలో ఆయన పలుకుబడి కూడా అలా వుండేది. ఆయన వ్యవహారతీరుతో కీలక నాయకులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఈయన పెత్తనం ఏమిటనే భావన వారిలో వచ్చింది. కానీ అధికార పార్టీకి ఎదురుతిరిగే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు వైసిపి ప్రతిపక్షంలో వుందికాబట్టి ఆ పని చేస్తున్నారు... ఆ పార్టీని వీడేందుకు చాలామంది సిద్దమయ్యారు. ఇందులో చాలామంది పార్టీ మారడానికి సజ్జలే కారణమని రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.

ఇప్పటికే వైఎస్ జగన్ ను సన్నిహితుడిగా పేరున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసిపిని వీడేందుకు సిద్దమయ్యారు. ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌ .కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇవాళ మోపిదేవి,  మస్తాన్ రావు రాజ్యసభ ఛైర్మన్ కు రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. వీరు టిడిపిలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.  

click me!