చంద్రబాబుపై పోస్ట్ పెడితేనే పోలీస్ కేసట... వేధించడంతో వికలాంగుడి ఆత్మహత్యాయత్నం (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 10, 2023, 3:02 PM IST
Highlights

 పోలీసుల వేధింపులు భరించలేక వికలాంగుడైన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభిమానంతో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట. ఇది స్థానిక వైసిపి నాయకులకు అస్సలు నచ్చలేదు. పోలీసులపై ఒత్తిడిచేసి అతడిపై కేసు పెట్టించారు. దీంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లగా తండ్రి ఆఛూకీ కోసం వికలాంగుడైన కొడుకును పోలీసులు వేధించారట. ఇది తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే...భట్టిప్రోలు మండలం కోళ్లపాలెం గ్రామానికి చెందిన మేరుగ కిరణ్ కుమార్ వికలాంగుడు. ఇతడి తండ్రికి టిడిపి అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా అభిమానం... దీంతో ఇటీవల చంద్రబాబు జైలునుండి విడుదలైన సందర్భంగా 'న్యాయం గెలిచింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇదే పోస్ట్ అతడి కొడుకు ప్రాణాలమీదకు తెచ్చింది. 

వీడియో

స్థానిక వైసిపి నాయకుల ఫిర్యాదుతో  కొల్లూరు ఎస్సై రాజ్యలక్ష్మి కిరణ్ కుమార్ తండ్రిపై 307 కేసు నమోదు చేసింది. దీంతో తండ్రి పరారీలో వుండగా ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలని వికలాంగుడైన కిరణ్ ను వేధించారట. ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో భరించలేకపోయిన కిరణ్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

సమయానికి కుటుంబసభ్యులు కిరణ్ ను గమనించి వెంటనే  హాస్పిటల్ కు తరలించారు. వెంటనే వైద్యం అందించిన డాక్టర్లు కిరణ్ ను కాపాడారు. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతడిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి కిరణ్ పరిస్థితి గురించి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే బాధితుడు కిరణ్ తో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. 
 

click me!