పదిరోజుల్లో రమ్య సోదరికి ప్రభుత్వోద్యోగం... ఇంటిస్థలం, ఐదెకరాల భూమి కూడా: సీఎం జగన్ ప్రకటన

By Arun Kumar PFirst Published Sep 10, 2021, 2:54 PM IST
Highlights

ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన దళిత యువతి రమ్య కుటుంబం సీఎం జగన్ ను కలిసింది. ఈ సందర్భంగా వారికి మరింత భరోసా ఇచ్చారు సీఎం. 

అమరావతి: ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయిన దళిత యువతి రమ్య కుటుంబానికి అండగా నిలిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రమ్య కుటుంబానికి పదిలక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదుసెంట్ల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి అందించనున్నట్లు స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.  

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు రమ్య కుటుంబసభ్యులు. స్వయంగా హోంమంత్రి సుచరిత రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావుతో పాటు సోదరి మౌనికను సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాస్సేపు వారితో మాట్లాడిన సీఎం రమ్య హత్యోదంతం గురించి తెలుసుకున్నారు. అలాగే వారి కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం కేవలం పది రోజుల్లోనే రమ్య సోదరి మౌనికకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రంతో మళ్లీ తనవద్దకు రావాలని... అప్పుడు అందరం కలిసి టీ తాగుదామంటూ బాధిత కుటుంబంతో ఆత్మీయంగా మాట్లాడారు సీఎం జగన్. 

ఇలా రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఐదు సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా వైసిపి ప్రభుత్వం అండగా వుంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబానికి తగిన న్యాయం దక్కేలా చూస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

read more వేధిస్తున్న వారిపై కేసులు: ఏపీ డీజీపీ సవాంగ్‌ను కలిసిన రమ్య పేరేంట్స్

ఇదిలావుంటే గుంటూరులో బిటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు భారతదేశానికే ఆదర్శమని ఇటీవల జాతీయ ఎస్సి కమిషన్ బృందం పేర్కొంది. దళిత యువతి హత్య కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించిందని తమ విచారణలో తేలిందని కమిషన్ బృందం వెల్లడించింది. 

''రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడాము. ఘటన అనంతరం ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న చర్యలు పట్ల వారుకూడా సంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన ముద్దాయిని అరెస్ట్ చేసి ఆరు రోజుల్లోనే పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలతో పాటు స్థానిక డి‌ఐజీ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో కేసు దర్యాఫు పూర్తి చేశారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారులందరికీ ఎస్సీ కమీషన్ తరపున అవార్డులు అందేవిధంగా కృషి చేస్తాం'' అని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు అన్నారు. 

 

click me!