గూడురు వైసీపీలో విభేదాలు.. విలువలేని చోట ఉండలేం.. రాజీనామాకు సిద్దమైన జెడ్పీటీసీ..!

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 11:58 AM IST
Highlights

తిరుపతి జిల్లా గూడూరులో వైసీపీలో వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. గతకొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు ఇప్పుడు మరింతగా ముదిరింది. ఈ క్రమంలోనే గూడూరు జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్దమయ్యారు. 

తిరుపతి జిల్లా గూడూరులో వైసీపీలో వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. గతకొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు ఇప్పుడు మరింతగా ముదిరింది. ఈ క్రమంలోనే గూడూరు జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్దమయ్యారు. వివరాలు.. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌పై నియోజకర్గంలోని సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విలువ ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అయితే గూడూరులో సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యే వరప్రసాద్ తీరుపై పలువురు నేతలు మండిపడుతున్నారు. 

సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యేతో విభేదాల కారణంగానే గూడూరు జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఆమె బాటలోనే పదువులకు రాజీనామా చేసేందుకు కొందరు ఎంపీటీసీలు రెడీగా ఉన్నారు. పదవి లేకపోయినా ఉండగలం.. కానీ విలువలేని చోట ఉండలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ క్రమంలోనే గూడూరు వైసీపీలో నెలకొన్న పరిణామాలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి.. యామినితో పాటు ఆమె అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. 

click me!