వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలోపే 72శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు ఈ మూడెళ్ళలో 3శాతం కూడా పూర్తికాలేదని టిడిపి ఎమ్మెల్యే గోర్లంట్ల బుచ్చయ్యచౌదరి ఆందోళన వ్యక్తం చేసారు.
పోలవరం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పొలవరం ప్రాజెక్ట్ (polavaram project) ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 శాతం పూర్తి చేసిందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం విషయంలో చేతులెత్తేసిందని... ఈ మూడేళ్లలో 3శాతం కూడా పూర్తిచేయలేకపోయిందని అన్నారు. డిసెంబర్ 2020 కల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసి రైతుల భూముల్లో నీరు పారిస్తామన్నారు... ఏమయ్యింది జగన్? అని ఎమ్మెల్యే గోరంట్ల నిలదీసారు.
''జగన్ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. తన బంధువు పీటర్ చేత నిర్మాణ దర్యాప్తు చేయించడంలో అర్థంలేదు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరం వద్ద శిలాఫలకాలు తప్ప ఏమీ లేవు. వెంటనే పనులు పూర్తిచేసి ఐదేళ్లలో 72 శాతం పూర్తిచేసాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి మళ్ళీ పోలవరం పనులను గాలికొదిలేసింది'' అని గోరంట్ల ఆరోపించారు.
''కనీసం ఇంగితజ్ఞానంలేని వ్యక్తులు మంత్రులు కావడం దౌర్భాగ్యం. ప్రాజెక్టులమీద ఏమాత్రం అవగాహన లేని మంత్రులు మీడియా మీద విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
''పోలవరం అప్రోచ్ ఛానల్ సరిగా చేయకపోవడంతో నీరు ఆగి పోలవరానికి గండి పడింది. ఇలా పనుల్లో నాణ్యత లోపించింది. అందువల్లే నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు బాధ్యతగల ప్రతిపక్షంగా పరిశీలించాలనుకుంటున్నాం. ఇది తెలిసే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారు? ఎందురు నాణ్యతగా పనులు చేయలేకపోతున్నారు?" అని మండిపడ్డారు.
ఇదిలావుంటే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ దుష్టచతుష్టయం పట్టి పీడిస్తోందని ఆరోపించారు. ఈ చతుష్టయ సభ్యులైన జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా పాలిస్తున్నారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊభిలోకి నెట్టాలని చూస్తున్నాడని అన్నారు. కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం ఖాయమని యనమల ఆందోళన వ్యక్తం చేసారు.
''జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుని పోయింది. కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి రుణాలను నిరోధించకపోతే రాష్ట్రానికి కొలెటరెల్ ఆర్థిక నష్టం జరగడం ఖాయం. అయినా కేంద్రం వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను ఎంతకాలం రక్షిస్తుంది? జగన్ రెడ్డి అవినీతి సొమ్ము కూడబెట్టుకుని రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నాడు. అవినీతి, అక్రమాలు, లూటీతో సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలి'' అని యనమల డిమాండ్ చేసారు.
''ఆదాయం లేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని రాష్ట్ర దయనీయ స్థితికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? వైసీపీ పతనం అంచున ఉంది. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. జగన్ రెడ్డి ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం అని ప్రజలు తెలుసుకున్నారు. ఇచ్చిన మాట..చేసిన వాగ్దానం అన్నింటినీ తుంగలో తొక్కారు. అన్ని వర్గాలను మోసం చేశారు. సంక్షేమ పథకాల అమలు కంటే ప్రకటనలకు, ప్రచారాలకే ప్రాధాన్యతనిచ్చారు. జగన్ రెడ్డి హామీలతో మోసానికి గురైన ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడం ఖాయం'' అని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.