
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు మే 6వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. జూలై 3వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ Suresh Kumar ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం జూలై 4న పాఠశాలలను పునఃప్రారంభించడంతో మొదలవుతుందని పేర్కొన్నారు. మే 4 లోగా 1–9 తరగతుల విద్యార్థులకు పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు. మే 5న ఇంగ్లిష్ లాంగ్వేజ్, వొకాబులరీపై విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా పాఠశాలలు మే 20 వరకు కొనసాగనున్నాయి. టీచర్లు మే 20 వరకు విధులకు హాజరవ్వాలి. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, మార్కులు, ఇతర సమాచారం అప్‌లోడింగ్ తదితరాల దృష్ట్యా 20 వరకు స్కూళ్లు కొనసాగనున్నాయని కమిషనర్ తెలిపారు. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 విద్యా సంవత్సరం గతేడాది ఆగస్టు 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
మరోవైపు 2021–22 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజ్‌లు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు మే 25 నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ శేషగిరిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 19 వరకు వేసవి సెలవులు ఉంటాయని.. జూన్ 20 నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి కాలేజ్‌లు ప్రారంభం అవుతాయని చెప్పారు. సెలవుల్లో కాలేజ్‌లు నిర్వహించే యజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, ఇంటర్ బోర్డ్ ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్‌కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలన్నారు.