సజ్జలతో నష్టం తప్పదు , టీడీపీ జనసేన కూటమికి 151 సీట్ల పైనే , ఓడిపోతే జగన్ అసెంబ్లీకి రాడు : గొనె ప్రకాష్ రావు

By Siva KodatiFirst Published Feb 7, 2024, 6:47 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రిని చంపినవారితో జగన్ ఒప్పందాలు చేసుకుంటున్నారని , జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా రారని గొనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బహిరంగ లేఖ రాసిన ఆయన.. సజ్జల సలహాలను నమ్ముకుంటే జగన్ నష్టపోతారని హెచ్చరించారు. వైఎస్ కుటుంబంతో తనకు 30 ఏళ్లుగా అనుబంధం వుందని, ప్రస్తుత పరిణామాలు వైఎస్ఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వుండటంతోనే తాను లేఖ రాస్తున్నానని ప్రకాష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ కుమార్తె షర్మిలపై జరుగుతున్న ప్రచారం వెనుక జగన్ హస్తం వుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ కోసం షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేస్తే ఆమెపై దుష్ప్రచారం చేసేలా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడటం క్షమించరాని నేరమని ప్రకాష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆడపిల్ల కంట కన్నీరు మంచిది కాదని.. షర్మిలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని ఆయన హితవు పలికారు. షర్మిలపై దుర్మార్గపు ప్రచారాన్ని ఆపకపోతే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని.. తల్లి, చెల్లిపై ఆయన అనుసరిస్తున్న తీరు దారుణమని గోనె ప్రకాష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రావడం వల్ల బలం పెరుగుతుందని.. ఈ కూటమికి వచ్చే ఎన్నికల్లో 151 సీట్లకు పైన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా రారని గొనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. మంత్రులు రోజా, విడదల రజనీలకు కానీ.. కొత్తగా ప్రకటించిన ఇన్‌ఛార్జీలలో 35 మంది వరకు బీఫాంలు ఇచ్చే పరిస్ధితి లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు గురించి తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని.. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యేనాటికి జగన్ డైపర్లు వేసుకునే వారని గోనె ప్రకాష్ రావు దుయ్యబట్టారు. 

జగన్‌ను నమ్ముకున్న పలువురు నేతలు రోడ్డున పడ్డారని.. కొండా సురేఖ, పువ్వాడ అజయ్, కోనేరు కోనప్ప, పుట్టా మధు, బాజిరెడ్డి వంటి ఎంతో మంది లిస్ట్‌లో వున్నారని ఆయన పేర్కొన్నారు. వీరంతా జగన్‌ను వదిలేసిన తర్వాతే కోలుకోగలిగారని ప్రకాష్ రావు వ్యాఖ్యానించారు. సోనియా కాళ్లు పట్టుకుని జగన్ జైలు నుంచి బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రిని చంపినవారితో జగన్ ఒప్పందాలు చేసుకుంటున్నారని.. రిలయన్స్‌పై దాడులు చేయించి, అదే సంస్థకు చెందిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారని గోనె ప్రకాష్ రావు ఫైర్ అయ్యారు. 

click me!