తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో మహాలక్ష్మీ దేవి విగ్రహం కళ్లు తెరిచిందంటూ పుకార్లు వ్యాపించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వైపు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలతో పొటీపడుతూ వుంటే మనదేశంలోని కొన్ని చోట్ల ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. బాణామతి, చిల్లంగి, క్షుద్రపూజలు, నరబలులు, జంతు బలుల గురించి ప్రతిరోజూ వింటూనే వున్నాం. దీనికి తోడు వేప చెట్టు నుంచి పాలు కారడం, వినాయకుడు పాలు తాగుతున్నాడని ఇలా రకరకాల వార్తలు మీడియాలో కనిపిస్తూనే వుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా వున్న చింతలో లక్ష్మీదేవి ఆలయం వుంది. కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. వీరిలో కొందరికి అమ్మవారు కళ్లు తెరిచినట్లుగా గుర్తించారట. అంతే ఈ విషయం ఆ నోటా, ఈ నోటా తెలియడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పవిత్ర కార్తీక మాసంలో అద్భుతం జరిగిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.