గంటాకు షాక్: కార్యాలయ భవనం కూల్చివేతకు రెడీ

By telugu teamFirst Published Aug 23, 2019, 10:42 AM IST
Highlights

'టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేయడానికి జీవీఎంసి సిద్ధపడింది. ఈ మేరకు గంటాకు జీవీఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, రాజకీయ కక్షతోనే అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని గంటా అంటున్నారు. 

విశాఖపట్నం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుకు చెందిన భిమిలీలోని క్యాంప్ కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసి) అధికారులు సమాయత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున దాన్ని 24 గంటల్లో కూల్చివేస్తామని జీవీఎంసి అధికారులు గురువారం సాయంత్రం గంటాకు నోటీసులు జారీ చేశారు. 

భవనం క్రమబద్ధీకరణకు తాను దరఖాస్తు చేసుకున్నానని, అయినా కూడా రాజకీయ కక్షతో దాన్ని తిరస్కరించి భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నరాని గంటా అంటున్నారు. జీవీఎంసీ పరిధిలోని భిమిలీలోని టౌన్ సర్వే నంబర్ 442లో గంటా కూతురు సాయిపూజిత పేరుతో నిర్మించిన భవనాన్ని గంటా క్యాంపు కార్యాలయంగా వాడుకుంటున్నారు. 

భవనానికి ఏ విధమైన ప్లాన్ లేకపోవడంతో చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు జీవీఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. దాన్ని తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం గోడకు అతికించారు. దానిపై గంటా హైకోర్టును ఆశ్రయించారు. 

దానిపై హైకోర్టు జీవీఎంసిని వివరణ కోరింది. అక్రమ నిర్మాణం కావడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు జీవీఎంసి అధికారులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు భవనాన్ని కూల్చే ముందు యజమానికి వారం రోజుల సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 24 గంటల్లో భవనాన్ని కూల్చివేస్తామంటూ జీవీఎంసి అధికారులు గంటాకు నోటీసులు జారీ చేశారు. భవనాన్ని కూల్చివేయాలంటే ఐదు రోజుల నోటీసు ఇవ్వాలని కోర్టు సూచించినా అందుకు విరుద్ధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని గంటా అన్నారు. అయితే, తమకు అలాంటి ఉత్తర్వులేవీ అందలేదని జీవీఎంసి చీఫ్ సీటీ ప్లానర్ ఆర్ జె విద్యుల్లత అన్నారు. 

click me!