తిరుమల బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారు, భారీగా తరలివచ్చిన భక్తులు

By Siva KodatiFirst Published Sep 22, 2023, 8:44 PM IST
Highlights

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ శుక్రవారం జరిగింది. మలయప్పస్వామి వారు తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనిమిచ్చారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. 

అంతకుముందు గరుడ వాహన సేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. దాదాపు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీవారు మోహనీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

click me!