ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య గురువారం నాడు ఆసక్తికర చర్చ సాగింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య సరదా సంభాషణ చోటు చేసుకొంది. గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో లాబీల్లో మంత్రికి, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య ఈ సంభాషణ జరిగింది.
also read:ఆయన చనిపోవడంతో చంద్రబాబులో మార్పు, బతికి ఉంటేనా...: గుట్టువిప్పిన మంత్రి అవంతి
టీడీపీలో నాయుడు అని ఉంటే తప్ప ప్రాధాన్యత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుచ్చయ్య కూడ నాయుడు అని పెట్టుకొంటే బాగుండేదని కన్నబాబు సరదాగా వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అసెంబ్లీలో ఎంత నిలదీస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని మంత్రి కన్నబాబు తో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు. తాము తప్పులు చెబుతు పోతోంటే మీరు ఆ తప్పులను సరి చేసుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అభిప్రాయపడ్డారు.
తాము సీఎంను ఒక్కసారి ఉన్మాది అంటే సభలో మీరు మమ్మల్ని వందసార్లు తీవ్రమైన విమర్శలు చేశారని అచ్చెన్నాయుడు మంత్రి కన్నబాబు చెప్పారు.ఈ వ్యాఖ్యలను ఎక్కువసార్లు చెప్పడం వల్ల ప్రజల్లోకి మీరే తీసుకెళ్లారని అచ్చెన్నాయుడు చెప్పారు.
పార్టీ మారే సమయంలో తాను మంత్రి అవుతానని అవంతి శ్రీనివాస్ చెప్పారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీలోకి తాను ఎప్పుడు వచ్చినా చంద్రబాబునాయుడు తనను తీసుకొంటారని అవంతి శ్రీనివాస్ చెప్పారని అచ్చెన్నాయుడు మంత్రి కన్నబాబు వద్ద ప్రస్తావించారు. అయితే మీ పార్టీలో విలువలు లేవా ...అని మంత్రి కన్నబాబు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుతో సరదాగా వ్యాఖ్యానించారు.