33 కేసులు... 23వ సారి జైలుపాలైన బీటెక్‌ దొంగ

By Arun Kumar PFirst Published Nov 23, 2020, 8:46 AM IST
Highlights

రాజకీయ నాయకులను, నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వ పథకాలను పావుగా వాడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. 

తిరుపతి: రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఓ అతితెలివి దొంగను పోలీసులు అరెస్టు చేసారు. అయితే అతడికి ఇదేమీ కొత్తకాదు. అల్లుడు అత్తవారింటికి వెళ్లివచ్చేలా అతడు జైలుకు వెళ్లి వస్తుంటాడు. అతడు రాజకీయ నాయకులను, నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వ పథకాలను పావుగా వాడుకుంటాడు. ఇలా మోసంచేసే క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కాడు. అయినా అతడు బుద్ది మార్చుకోకుండా మళ్లీ అదే మోసాల బాటపట్టి తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు. 

వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తిచేసి 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో విశాఖలో పనిచేస్తుండగా అప్పటి తణుకు ఎమ్మెల్యే పీఏ నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఉద్యోగం  కోల్పోయి మొదటిసారి జైలుకెళ్లాడు. 

జైలునుండి బయటకు వచ్చాక ఉద్యోగం లేకపోవడంతో మోసాలనే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలు చేయడం ప్రారంభించాడు. ప్రభుత్వ పథకాల కింద నిధులు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా అతడిపై 33 కేసులు నమోదవగా 23సార్లు జైలుకు వెళ్లాడు.  

తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం రెండున్నర లక్షలు వసూలు చేశాడు. చాలారోజులు అవుతున్న పని కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. 

 

click me!