బాలుడిని కాపాడటానికి వెళ్లి.. ప్రమాదానికి గురైన కూలీలు..!

By telugu news teamFirst Published Dec 19, 2020, 9:33 AM IST
Highlights

 ఈ సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి తమ వాహనాలు ఆపి క్షతగాత్రుడికి సపర్యలు చేయడానికి వెళ్లారు. 

వారంతా రోజు కూలీలు. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితాలు. ఉదయాన్నే పనికోసం బయలుదేరి వెళ్లారు. వారి కళ్లముందు ఓ బాలుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావమై అల్లాడుతుంటే చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ లోపు ఓ లారీ వచ్చి వారిని కూడా ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా బత్తంపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్‌(20). అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్‌ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఆయన బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి తమ వాహనాలు ఆపి క్షతగాత్రుడికి సపర్యలు చేయడానికి వెళ్లారు. 

బాధితుడికి వారు సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు(40), ముష్టూరుకు చెందిన శివమ్మ(50), సంజీవపురానికి చెందిన సూరి(45), వలి(50)లు గా గుర్తించారు. వీరిలో శ్రీనివాసులు ఘటనాస్థలిలోనే మరణించగా, మిగతావారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు వదిలారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు వాహనాలు వదిలేసి పరారయ్యారు. మృతుల్లో శ్రీనివాసులుకు భార్య సువర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 

click me!