చెప్పినా వినలేదు: చంద్రబాబుపై సుజనా చౌదరి అసంతృప్తి

By narsimha lodeFirst Published Jun 17, 2019, 3:05 PM IST
Highlights

మోడీ మంత్రివర్గం నుండి వైదొలగడం అసందర్భమమైన నిర్ణయమని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగినా కూడ ఎన్డీఏలోనే ఉండాలని తాను చేసిన సూచనను కూడ చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

హైదరాబాద్: మోడీ మంత్రివర్గం నుండి వైదొలగడం అసందర్భమమైన నిర్ణయమని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగినా కూడ ఎన్డీఏలోనే ఉండాలని తాను చేసిన సూచనను కూడ చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పలు విషయాలను వెల్లడించారు. ఎన్డీఏ‌లో తాము కొనసాగి ఉంటే  మరోసారి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

మోడీ మంత్రివర్గం నుండి  వైదొలిగే విషయమై తాను చంద్రబాబునాయుడుతో చర్చించినట్టుగా చెప్పారు. కానీ చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు తాము మంత్రి పదవులకు రాజీనామా చేశామన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినా కూడ ఎన్డీఏలో ఉండి ఉంటే ఈ దఫా కూడ టీడీపీకే అధికారం దక్కేదన్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్  సహాయంతో తాము అధికారంలోకి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను దూరం చేసుకొన్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో దెబ్బతినేందుకు తమ పార్టీ కారణమైందన్నారు. కానీ, అదే సమయంలో  తమ పార్టీ కూడ అధికారానికి దూరమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీలో బలహీనమైన పార్టీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు లెక్కలు ఎక్కడో తప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2014 లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోయినట్టుగా సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే గవర్నెన్స్ విషయంలో అనేక  పొరపాట్లు చోటు చేసుకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు.

టీడీపీని వీడుతానని తనపై ప్రచారం చేస్తున్నారని... తనకు అలాంటి అవసరం లేదని  సుజనాచౌదరి చెప్పారు.ఒకవేళ అదే పరిస్థితి వస్తే ముందుగా ఆ విషయాన్ని చంద్రబాబుకు చెబుతానన్నారు. ఆ తర్వాత మీడియాకు కూడ ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టు సుజనా తేల్చి చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో పిల్లి మొగ్గలు వేయడం కూడ తమకు నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం నుండి  రాబట్టాల్సిన నిధుల విషయంలో వెనక్కు వెళ్లలేదన్నారు. రాష్ట్రానికి  దక్కాల్సిన నిధులను రాబట్టుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు.

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కోటరీలో తాను ఉండేవాడినని సుజనా చౌదరి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత తాను కేంద్ర మంత్రి పదవి రావడంతో ఎక్కువగా ఢిల్లీకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. 2014-19 మధ్యలో  తాను  చంద్రబాబు కోటరీలో లేనని చెప్పారు.

మనుషులతో కంటే... మిషన్లు చెప్పే మాటలను చంద్రబాబునాయుడు నమ్మారని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సర్వేల మీద ఆధారపడ్డారన్నారు. పాలనపై కేంద్రీకరించి..... పార్టీని పట్టించుకోలేదన్నారు. ఈ కారణాలతోనే  పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకొందని  సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.

మంగళగిరి నుండి పోటీ చేయడం లోకేష్ చేసిన తప్పు అని సుజనా చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నియోజకవర్గం కాకుండా మరో నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నెగెటివ్ ఓటింగ్ ఆధారంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని సుజనా చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబునాయుడును తనిఖీ చేసిన సమయంలో తాను కూడ అక్కడే ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇలా చేయడంలో తప్పేమీ లేదన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదన్నారు. 

చంద్రబాబు ఒకే కులాన్ని పెంచిపోషించారనేది అవాస్తవమని సుజనా చెప్పారు. ఈ రకమైన విధానాన్ని బాబు ఏనాడూ ప్రోత్సహించరని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయమై తప్పుడు ప్రచారం జరిగిందని సుజనా అభిప్రాయపడ్డారు.

తాను కేంద్ర మంత్రిగా కాక ముందు కూడ తన కంపెనీలపై దాడులు జరిగాయన్నారు. 2004 తర్వాత తాను కంపెనీల వ్యవహరాల్లో తలదూర్చడం లేదన్నారు.తాను ఏ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులో కూడ తప్పు చేయబోనన్నారు. 2004 నుండి తన కంపెనీల వ్యవరాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం లేదన్నారు.

click me!