భూమా కుటుంబంలో ఆస్తిగొడవ: అక్కపై జగత్ విఖ్యాత్ రెడ్డి ఏమన్నారంటే.....

By Nagaraju penumalaFirst Published Nov 23, 2019, 9:33 PM IST
Highlights

 అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి విక్రయంపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. అయితే ఆ స్థలం విలువ ఇప్పుడు మార్కెట్లో రెట్టింపు అయ్యింది. దాంతో జగత్ విఖ్యాత్ రెడ్డి రివర్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. 

కర్నూలు: మాజీమంత్రి భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించానంటూ వస్తున్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. తాను కోర్టులను ఆశ్రయించానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 

తాను దుబాయ్ లో ఉన్నానని అందుల్లే ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. తన సోదరి మాజీమంత్రి భూమా అఖిలప్రియ అంతా కలిసే ఉన్నామని ఇకపై కలిసే ఉంటామని తెలిపారు. 

భూమా నాగిరెడ్డి అభిమానులు, క్యాడర్ ను బలోపేతం చేసే దిశగా తన సోదరితో కలిసి అడుగులు వేస్తున్నానని తెలిపారు. అంతేగానీ పార్టీకి గానీ, భూమా కుటుంబానికి గానీ మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించనని తెలిపారు. 

భూమా అభిమానులు, కార్యకర్తలు తమ కుటుంబంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దన్నారు. తాను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తానని జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇకపోతే భూ వివాదానికి సబంధించి మాజీమంత్రి భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటూ వార్తలు వచ్చాయి. తన ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్టులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపిచారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

షాక్: భూమా అఖిలప్రియపై సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు

భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి విక్రయంపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. 

అయితే ఆ స్థలం విలువ ఇప్పుడు మార్కెట్లో రెట్టింపు అయ్యింది. దాంతో జగత్ విఖ్యాత్ రెడ్డి రివర్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. స్థలం అమ్మే సమయానికి తాను మైనర్ నని తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితోపాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కోరుతూ జగత్ విఖ్యాత్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.  

తన సోదరిలు అఖిలప్రియ, మౌనికరెడ్డిలతోపాటు భూమి కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల, చందు రేటూరి, సయ్యద్‌ ఎతేష్యామ్‌ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడంటూ వార్తలు హల్ చల్ చేశాయి. 

జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది శ్రీసాయి చంద్రహాస్‌ కేసు వేశారని తెలుస్తోంది. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

తమపై తమ సోదరుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు.. తమ సోదరుడు తమపై కేసులు వేయలేదన్నారు. భూవిక్రయంపై కొనుగోలు దారులు కోర్టుకు వెళ్లారని అందులో భాగంగానే తమకు తాఖీదులు వచ్చాయంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఇలాంటి తరుణంలో జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలన్నీ తాను ఎలాంటి కేసులు పెట్టలేదని జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. 


 

click me!