రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్య ప్రయాణికులతో బిజీగా వుండే గన్నవరం విమానాశ్రయాన్ని ఇవాళ ఉదయం పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. గన్నవరం పరిసరాలను తీవ్ర పొగమంచు కమ్మేయడంతో ఇవాళ ఉదయం రెండు విమానాలు కొద్దిసేపు గాల్లోనే చక్కర్లుకొట్టాల్సి వచ్చింది. చాలాసేపటి తర్వాత పొగమంచు కాస్త తగ్గడంలో విమానాలు సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి.
గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయ ప్రాంతాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దీంతో హైదరాబాద్, చెన్నై ల నుండి ప్రయాణికులతో గన్నవరం చేరుకున్న ఇండిగో విమానాలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాలేకపోయాయి. రన్ వే కనిపించకపోవడంతో విమానాలు అలాగే కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు కంగారుపడ్డారు. గన్నవరం విమానాశ్రయ సిబ్బంది పరిస్థితిని సమీక్షించి పొగమంచు కాస్త తగ్గగానే విమానాల ల్యాండింగ్ కు అనుమతిచ్చారు.
Also Read చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం .. తప్పిన ముప్పు
గత కొద్దిరోజులుగా గన్నవరంలో వాతావరణ పరిస్థితి ఇలాగే వుందని... విపరీతమైన పొగమంచు కారణంగా ఉదయం విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి వుంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.