కృష్ణా జిల్లాలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో ఆరునెలల చిన్నారి సహా ఐదుగురు మృతి

Arun Kumar P   | Asianet News
Published : Mar 13, 2022, 10:50 AM ISTUpdated : Mar 13, 2022, 10:59 AM IST
కృష్ణా జిల్లాలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో ఆరునెలల చిన్నారి సహా  ఐదుగురు మృతి

సారాంశం

కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరునెలల పసిపాప సహా ఐదురుగు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.  

విజయవాడ: కృష్ణా జిల్లా (krishna district) జగ్గయ్యపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి సాగర్ కెనాల్ వాల్ ను ఢీకొట్టడంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ లో చికిత్సపొందుతూ చనిపోయారు. మృతుల్లో ఆరు నెలల పసిపాప వుంది.  

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ (hyderabad) నగరంలోని చందానగర్ హుడా కాలనీకి చెందిన కొందరు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బయలుదేరారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి కారులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 65 పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.  

జగ్గయ్యపేట (jaggayyapet) మండలం గౌరవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. నాగార్జునసాగర్ (nagarjunasagar canal) ఎడమకాలువ వంతెన కల్వర్టును వేగంగా వెళుతూ అదుపుతప్పిన కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే తీవ్ర గాయాలపాలైన చిన్నారితో సహా మిగతా ఇద్దరిని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే  హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆరునెలల చిన్నారి, మరొకరు మృతిచెందారు. ఇంకొకరి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం.

ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతివేగంతో వస్తున్న కారు చిన్నపాటి మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒకవేళ కల్వర్టును ఢీకొట్టకుంటే కారు సాగర్ కాలువలో పడేదని స్థానికులు చెబుతున్నారు.  

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఇలా ఐదుగురు మృతిచెందడంలో ఇటు జంగారెడ్డిగూడెంతో పాటు అటు హైదరాబాద్ చందానగర్ లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇదే కృష్ణా జిల్లాలో మరో ఘోర ప్రమాదం కూడా చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటోను వెనకవైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 14మంది మహిళలు తీవ్రంగా గాయపడగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది.

 కృష్ణా జిల్లాకు  మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన కొందరు కూలీలను తీసుకెవెళుతున్న ఆటో ప్రమాదానికి గురయ్యింది. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా  గూడూరు మండలం పర్ణశాల గ్రామం వద్ద కూలీల ఆటోను వెనకవైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలోని కూలీలంతా గాయపడ్డారు. 

వెంటనే గాయపడిన కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఆరుగురు కూలీల పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు. 

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu