కరోనా ఎఫెక్ట్: విశాఖ రైల్వేస్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులు ముందే తెలుసుకుంటే బెటర్

By Siva KodatiFirst Published Apr 13, 2021, 8:55 PM IST
Highlights

వైరస్‌ను అరికట్టేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌ వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రేపటి నుంచి రైల్వే స్టేషన్‌ లోపలికి వెళ్లే దారి.. బయటకు వచ్చే దారి వేర్వేరుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సైతం ప్రాధాన్యతనిస్తోంది.

మరోవైపు వైరస్‌ను అరికట్టేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌ వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రేపటి నుంచి రైల్వే స్టేషన్‌ లోపలికి వెళ్లే దారి.. బయటకు వచ్చే దారి వేర్వేరుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

రైల్వే స్టేషన్‌కి వచ్చే ప్రయాణికులను జ్ఞానాపురం గేట్ వద్దనున్న ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫారం మీదుగా స్టేషన్ లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే లోనికి అనుమతిస్తామని... అలాగే స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే వారికి ఒకటో ప్లాట్‌ఫారం నుంచి అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  

Also Read:ఏపీలో భయపెడుతున్న కరోనా: కొత్తగా 4,228 కేసులు.. చిత్తూరులో పరిస్ధితి ఆందోళనకరం

రైల్వే స్టేషన్‌లో గుంపులుగా ఉండొద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్ షీట్ల సరఫరా లేదని.. కర్టెన్లు కూడా తొలగించామని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తిని ఆరికట్టేందుకు చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ ధరించడం లాంటివి తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.  

గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క విశాఖ జిల్లాలోనే 414 మందికి వైరస్‌ సోకగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు విశాఖలో మొత్తంగా 65,576 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 588 మంది చనిపోయారు   

click me!