
సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అది కూడా ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలో, అందరూ చూస్తుండగా. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. తమ గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని కొందరు కబ్జా చేయడంతో పొలాలకు వెళ్లలేకపోతున్నామని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెంగుబల్ల గ్రామ మాజీ సర్పంచ్ గోపాలప్ప రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు.
వారు సమస్యను పరిష్కరించకపోవడంతో విసిగెత్తిన గోపాలప్ప మంగళవారం శాంతిపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం గుమ్మానికి తాడు బిగించి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడున్న సిబ్బంది, అధికారులు గోపాలప్పను అడ్డుకుని విషయం కనుక్కున్నారు. అధికారులు స్పందించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గోపాలప్ప వెనుదిరిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.