పోలవరంకు అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే చర్యలేవి : ఉండవల్లి అరుణ్ కుమార్

By Siva KodatiFirst Published Sep 2, 2022, 7:21 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే వచ్చాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాఫర్ డ్యాం కట్టకుండా.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని , ఈ తప్పు చంద్రబాబుదేనని అంబటి రాంబాబు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.

గోదావరి నీటితో కోస్తాంధ్రని, కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలుగన్నారని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ‘‘జలయజ్ఞం పోలవరం- ఓ సాహసి ప్రయాణం ’’ పేరిట మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రచించిన పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి ప్రసంగిస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలు అవుతుండటాన్ని చూసి వైఎస్ ఆవేదన వ్యక్తం చేసేవారని అరుణ్ కుమార్ తెలిపారు.

వైఎస్ చనిపోవడానికి 12 రోజుల ముందే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులన్నీ వచ్చాయని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే తీసుకోవాలని నీతి అయోగ్ చెప్పిందని ఉండవల్లి తెలిపారు. కాఫర్ డ్యాం కట్టకుండా.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని , ఈ తప్పు చంద్రబాబుదేనని అంబటి రాంబాబు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏది ముందు కట్టాలనే దానిపై సమాధానం చెప్పాల్సింది ఇంజనీర్లేనని.. చంద్రబాబు, జగన్ ఏం చేస్తారని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రూ.2000 కోట్ల ప్రజా ధనం వృథా అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ భారీ వరదలు చోటు చేసుకుంటే.. మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోతుందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి కాస్త న్యాయం జరిగింది పోలవరంతోనే అని ఆయన అన్నారు. 
 

click me!