
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని స్వాగతించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కారణంగా ఏపీకి మంచి జరిగే అవకాశం వుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేకహోదా సహా రాష్ట్రానికి లభించాల్సిన అన్నింటి విషయంలో న్యాయం జరుగుతుందని అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన విషయాన్ని కూడా అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిందని అరుణ్ కుమార్ చెప్పారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో చంద్రబాబుకు చెప్పానని.. కానీ ఆయన చేయలేదని ఉండవల్లి గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏప్రిల్ 11న విచారణ జరుగుతుందని అరుణ్ కుమార్ అన్నారు.
ALso REad: అలా చేస్తే ఏపీకి జగన్ అన్యాయం చేసినట్టే: ఉండవల్లి అరుణ్ కుమార్
ఇకపోతే.. ఇదే అంశానికి సంబంధించి గతేడాది డిసెంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టారన్నారు. అయితే ఆ సమయంలో విభజనకు వ్యతిరేకమని, విభజన జరగనివ్వమని జగన్ చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆనాడు పార్లమెంట్ బహిష్కరించిన 16 మందిలో జగన్ కూడా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఎనిమిదేళ్లైనా కూడా కేంద్రం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని అరుణ్ కుమార్ చెప్పారు. తెలంగాణ, ఏపీని ఇప్పుడు కలపాలని తన ఆలోచన కాదన్నారు.