జగన్! సీఎం రమేష్ ను వదలొద్దు, విచారణ జరిపించండి: మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డిమాండ్

By Nagaraju penumalaFirst Published Jun 7, 2019, 3:29 PM IST
Highlights

రాష్ట్రంలో సీఎం రమేష్ చేపట్టిన ప్రతీ పని అవినీతిమయమంటూ నిప్పులు చెరిగారు. సీఎం రమేష్ చేపట్టిన కాంట్రాక్టు పనులపై సీఎం జగన్ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డిమాండ్ చేశారు. 

కడప: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం రమేష్ ఆడిందే ఆట పాడిందే పాటలా సాగిందని ధ్వజమెత్తారు. 

కడపలో మీడియాతో మాట్లాడిన వరదరాజులరెడ్డి ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఎవరికీ లేనంతగా రూ.4000 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేపట్టారని స్పష్టం చేశారు. ఈ పనులు సీఎం రమేష్ కి వచ్చేందుకు పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అధికారులు సహకరించారని ఆరోపించారు. 

అందరికీ డబ్బులు పంచి తన పనులు చక్కబెట్టుకున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయాలకు పెద్ద ఎత్తున గండికొట్టారని ధ్వజమెత్తారు. ఇకపోతే ఆప్కో ఛైర్మెన్ గుజ్జుల శ్రీను రమేష్ నాయుడు బంటు అని స్పష్టం చేశారు. 

ఆప్కోలో గతంలో ఉన్న చైర్మెన్ ను దించి తన బంటు అయిన శ్రీనును ఆ పదవిలో కూర్చోబెట్టి వందలకోట్ల రూపాయల ఆప్కో సొమ్మును తినేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం రమేష్ చేపట్టిన ప్రతీ పని అవినీతిమయమంటూ నిప్పులు చెరిగారు. సీఎం రమేష్ చేపట్టిన కాంట్రాక్టు పనులపై సీఎం జగన్ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డిమాండ్ చేశారు. 

click me!