ఎన్టీఆర్ కి మైక్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే... యనమల

By telugu teamFirst Published Dec 11, 2019, 1:51 PM IST
Highlights

 ప్రతి ఎమ్మెల్యేను పిలిచి వారి అభిప్రాయం నమోదు చేశాం. వారంతా చంద్రబాబు నాయకత్వానికే మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకొన్నట్లు అధికారికంగా లేఖ పంపారు.

అసెంబ్లీలో ఎన్టీఆర్ కూడా మైక్ ఇవ్వలేదంటూ స్పీకర్ తమ్మనేని సీతారం అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పై తాజాగా యనమల వివరణ ఇచ్చారు. యనమల స్పీకర్ గా ఉన్న సమయంలో... ఎన్టీఆర్ కి మైక్ ఇవ్వకపోవడానికి గల కారణాలను మీడియాకు వివరించారు.

‘‘అప్పట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షంలో చీలిక వచ్చింది. 163 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అది నిజమో కాదో విచారించి నివేదిక ఇవ్వాలని అప్పటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ నన్ను ఆదేశించారు. ప్రతి ఎమ్మెల్యేను పిలిచి వారి అభిప్రాయం నమోదు చేశాం. వారంతా చంద్రబాబు నాయకత్వానికే మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకొన్నట్లు అధికారికంగా లేఖ పంపారు. శాసనసభను సమావేశపర్చినప్పుడు సభా వ్యవహారాల సంఘం భేటీ నిర్వహించాం.
 
దానికి శాసనసభాపక్ష నేతలను మాత్రమే పిలుస్తారు. అప్పటికే టీడీపీ ఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నికైనందువల్ల ఆయననే పిలిచాం. దీనిపై సభలో ఎన్టీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశానికి తనను పిలవకపోవడంపై మాట్లాడతానని అన్నారు. దానిపై మాట్లాడటానికి ఏమీ లేదని, ఇతర విషయాలు మాట్లాడతానంటే విశ్వాస తీర్మానంపై చర్చలో అవకాశమిస్తామని చెప్పాను. ఆయన బీఏసీ అంశంపైనే మాట్లాడతానని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం అది కుదరదని నేను చెప్పాను. ఆయన అలిగి వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌పై వ్యక్తిగా ఎంత గౌరవం ఉన్నా స్పీకర్‌గా సంప్రదాయాలు పాటించక తప్పదు’’ అని యనమల వివరించారు.

click me!