
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీతో ఏ ఒక్క పార్టీ అయినా కలుస్తుందా అని దుయ్యబట్టారు. 175 స్థానాల్లో ఒక్క చోటైనా మీతో కలిసి నడిచే పార్టీ వుందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేయడం టీడీపీకి కొత్త కాదని.. పలు ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేశామని చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. నేషనల్ ఫ్రంట్, యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల్లోనూ భాగస్వాములం అయ్యామని సోమిరెడ్డి తెలిపారు. నియంత, అరాచకవాది కాబట్టే జగన్‌తో కలిసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటంటూ జగన్‌కు ఆయన చురకలంటించారు.
అంతకుముందు మంగళవారం తెనాలిలో రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధుల కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనే అన్యాయస్తుడు సీఎంగా ఉన్న సమయంలో కరువు విలయతాండవం చేసిందన్నారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ కరువు రాలేదన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయని .. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ALso REad: కరువుతో బాబుకు స్నేహం, మాకు వరుణుడి ఆశీస్సులు: ఏపీ సీఎం జగన్
రైతు భరోసాతో రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. పట్టా ఉన్న రైతుకే కాకుండా అసైన్డ్ భూముల రైతులకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులను అందిస్తున్నామని సీఎం గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా రూ. 27 వేల కోట్లను ఇప్పటికే అందించినట్టుగా సీఎం జగన్ వివరించారు. ఆర్ బీ కే కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుండి ఎరువుల వరకు తోడుగా నిలుస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ఆర్ బీ కే కేంద్రాలు దేశంలోని పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిటిచినట్టుగా సీఎం జగన్ వివరించారు.
నాలుగేళ్లుగా ఆహర ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగిందని సీఎం జగన్ చెప్పారు. ధాన్యం సేకరణకు రూ. 55 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు నష్టపోతే అదే ఏడాది రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సిడీని అందిస్తున్న చరిత్ర తమ ప్రభుత్వానిదని సీఎం జగన్ చెప్పారు.