
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ప్రస్తుతం చెప్పు చుట్టూనే తిరుగుతోంది. కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఆ మరుసటి రోజే కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. పవన్ ఒక చెప్పు చూపిస్తే ఆయన రెండు చెప్పులు చూపించి మక్కెలిరిగిపోతాయని గట్టి హెచ్చరిక చేశారు.
రెండ్రోజులు సైలెంట్‌గా వున్న పవన్ కల్యాణ్.. నిన్న పిఠాపురంలో జరిగిన సభలో మళ్లీ చెప్పుల ప్రస్తావన తెచ్చారు. తాను అన్నవరం ఆలయానికి దర్శనానికి వెళితే ఎవరో తన రెండు చెప్పులూ కొట్టేశారని పేర్ని నానిపై సెటైర్లు వేశారు. అవి తనకు ఎంతో ఇష్టమైన చెప్పులని, ఎవరికైనా కనిపిస్తే దయచేసి చెప్పాలని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ఆలయాల్లో చెప్పులు కొట్టేసే స్థాయికి దిగజారారని ఆయన దుయ్యబట్టారు.
ALso Read: నా రెండు చెప్పులూ ఎవరో కొట్టేశారు .. ఇంతగా దిగజారాలా : పేర్ని నానిపై పవన్ సెటైర్లు
దీనికి పేర్ని నాని అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. పవన్‌కు చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడని.. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూసుకోవాలని సెటైర్లు వేశారు. గతేడాది అక్టోబర్ 18వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఎవరో తన చెప్పు కొట్టేశాడని నాని అన్నారు. ఆ పక్కనే పవన్ కల్యాణ్ ఆఫీస్ వుందని ఆయనను అనుమానించలేం కదా అంటూ బందర్ ఎమ్మెల్యే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోందని.. ఒక చెప్పుతో ఏం చేసుకుంటాడోనంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. చెప్పులు పోయిన మూడ్రోజులకే పవన్ కంగారు పడుతున్నారని.. మరి నా చెప్పు పోయి 9 నెలలు అవుతోందన్నారు.