చంద్రబాబుకు కోర్టులో దొంగ అఫిడవిట్‌లు ఇస్తున్నారని.. నిన్నటి వరకు బాహుబలి డైలాగులు చెప్పారని, ఇప్పుడు మాత్రం గుండెకు బొక్కపడింది, బాడీలో కాయలు పోయాయంటూ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని సెటైర్లు వేశారు. టీడీపీకి పురందేశ్వరి బీ టీమ్ అని.. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారిలో ఆమె పాత్ర కూడా వుందని కొడాలి నాని ఆరోపించారు.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో రెచ్చిపోయారు. టీడీపీకి పురందేశ్వరి బీ టీమ్ అని.. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారిలో ఆమె పాత్ర కూడా వుందని కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబుకు ఇప్పించింది దగ్గుబాటేనని.. పురందేశ్వరి లాంటి కూతురు ఎవరికి ఉండదన్నారు. చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిలో ఆమెకు కూడా వాటా వుందని కొడాలి నాని ఆరోపించారు. ఇసుక దోపిడీలోనూ పురందేశ్వరికి వాటాలు వెళ్లాయని.. జగన్ ఇసుక దోపిడీ అంటూ ఆమె సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. జగన్ హయాంలో ఇసుక ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో ఇసుక ద్వారా రూపాయి ఆదాయం లేదని.. 2014, 19లలో ప్రజలు బుద్ధి చెప్పినా పురందేశ్వరి మారలేదని కొడాలి నాని చురకలంటించారు. చంద్రబాబుకు కోర్టులో దొంగ అఫిడవిట్‌లు ఇస్తున్నారని.. నిన్నటి వరకు బాహుబలి డైలాగులు చెప్పారని, ఇప్పుడు మాత్రం గుండెకు బొక్కపడింది, బాడీలో కాయలు పోయాయంటూ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు జీవితమంతా అవినీతి బొక్కలు, మచ్చలేనని .. జగన్ పాలనలో అవినీతికి తావులేదని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: vijayasai reddy : పురందేశ్వరి గారూ... బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారో చెప్తారా ? - విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి (vijayasai reddy) సైతం పురందేశ్వరి (purandeswari)పై విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి ఎందుకు వచ్చారని, తరువాత కాంగ్రెస్ (congress) లోకి చేరి, అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. అక్కడ ఎంత కాలం ఉంటారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ మేరకు పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో సోమవారం ఓ పోస్టు పెట్టారు.
అంతకు ముందు మరో పోస్టులో కూడా పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి ఇలాంటి విమర్శలే చేశారు. ఎన్టీఆర్ (NTR) పెద్ద కూతురిగా పుట్టి, ఆయననే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తరువాత ఎన్టీఆర్ వ్యతిరేకించే కాంగ్రెస్ (Congress) లో చేరారని, అక్కడ మంత్రి పదవి చేపట్టారని తెలిపారు. ఇక కాంగ్రెస్ కు అధికారం ఉండబోదని బీజేపీలో చేరారని ఆరోపించారు.
‘‘ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి, బీజేపీలో పదవి పొంది, టీడీపీ అధ్యక్షుడైన మీ మరిది కోసం, అది కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టిన మీ మరిది కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ముకాస్తున్నారంటే...ఇన్ని రంగులు మార్చగల మీ నైపుణ్యాన్ని ఏమని పిలవాలి?’’ అని ప్రశ్నించారు.