మళ్లీ అధికారంలోకి రావాలంటే...చంద్రబాబు చేయాల్సింది ఇదే

By ramya neerukondaFirst Published Dec 13, 2018, 12:14 PM IST
Highlights

పవన్ దూరం అవ్వడం వల్ల.. 90శాతం కాపు సామాజికవర్గం నేతలు పార్టీకి దూరమయ్యారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టి మూడో పెద్ద తప్పు చేశారన్నారు. 

ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే.. తన చాణక్యతను  ప్రదర్శించాలని మాజీ మంత్రి హరిరామజోగయ్య సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ టీఆర్ఎస్ ని ఓడించేందుకు కాంగ్రెస్ తో జతకట్టి.. మహాకూటమి పేరిట ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకి పరాభవమే ఎదురైంది. 

అయితే.. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై పడే అవకాశం ఉందని హరిరామజోగయ్య హెచ్చరిస్తున్నారు. బీజేపీతో విభేదించి.. ఎన్డీయే నుంచి బయటకురావడమే చంద్రబాబు చేసిన మొదటి తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని కారణంగా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం ఆగిపోయిందని.. దీంతో.. రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోయిందన్నారు.

ఇంకో రెండో తప్పు.. పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకోవడమన్నారు. పవన్ దూరం అవ్వడం వల్ల.. 90శాతం కాపు సామాజికవర్గం నేతలు పార్టీకి దూరమయ్యారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టి మూడో పెద్ద తప్పు చేశారన్నారు. ఏపీలో ప్రజలు ఇంకా.. రాష్ట్ర విభజనను మర్చిపోలేదని.. అలాంటి సమయంలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం భవిష్యత్తులో నష్టం చేకూరుస్తుందన్నారు.

అభివృద్ధి మొత్తం అమరావతిలోనే జరుగుతుండటంతో.. మిగిలిన జిల్లాలు చిన్నబోతున్నాయన్నారు. ఈ ప్రభావం కూడా ఎన్నికలపై పడుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ చంద్రబాబుని బూచిగా చూపించి.. ఎన్నికల్లో విజయం సాధించాడని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కూడా విజయానికి ఓ కారణమైందన్నారు.

తెలంగాణ పరిస్థితులు.. ఏపీ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయన్నారు. చంద్రబాబు కూడా.. తాను చేసిన అభివృద్ధి చూపించి ఎన్నికలకు వెళదాం అనుకుంటే నష్టపోతారని.. ఇప్పటికైనా చంద్రబాబు తన చాణక్య తెలివిని ప్రదర్శించి.. ఎన్నికల్లో గట్టెక్కాలని హితవు పలికారు. 

click me!