టిక్కెట్‌ నిరాకరణ .. తీవ్ర మనస్తాపంలో గొల్లపల్లి సూర్యారావు , టీడీపీని వీడేందుకు నిర్ణయం ..?

Siva Kodati |  
Published : Feb 27, 2024, 03:54 PM ISTUpdated : Feb 27, 2024, 03:55 PM IST
టిక్కెట్‌ నిరాకరణ .. తీవ్ర మనస్తాపంలో గొల్లపల్లి సూర్యారావు , టీడీపీని వీడేందుకు నిర్ణయం ..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాతో రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి సెగ రేగింది. ఈ క్రమంలోనే టీడీపీని వీడేందుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాతో రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి సెగ రేగింది. టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు అధినేతల నిర్ణయంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన అసంతృప్త నేతలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరిని బుజ్జగించేందుకు ఆయా అధిష్టానాలు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం వినడం లేదు. వీరిలో కొందరు పార్టీలు మారేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు సీటు ఆశించిన ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడేందుకు ఆయన సిద్ధమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇంటి వద్ద గతంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను సైతం తొలగించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అనంతరం రాజోలు నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారట గొల్లపల్లి సూర్యారావు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాత వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సూర్యారావును అమలాపురం నుంచి లోక్‌సభ బరిలో పంపాలని జగన్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి సూర్యారావు నిజంగానే టీడీపీ వీడతారా లేక ఆయనను బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగుతారా అన్నది తెలియాల్సి వుంది. 

కాగా.. గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సూర్యారావు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి.. 2019లో మాత్రం ఓటమి పాలయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్