
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్యపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (dl ravindra reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. కోడికత్తి మాదిరిగానే వివేకా హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉందని ఆయన బాంబు పేల్చారు. చిన్నాన్నను చంపిన విషయం జగన్‌కు, వారి బంధువులకు తెలుసునని కూడా డీఎల్ వ్యాఖ్యానించారు.
ఇక ఏపీలోని వైసీపీ పాలనపైనా డీఎల్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని .. వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయగలిగితేనే సామాజిక న్యాయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మూడు ఫేక్ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించిన డీఎల్... 3 కంపెనీలతో ఒప్పందాల కోసమే అయితే దావోస్ వెళ్లాల్సిన పని లేదంటూ సెటైర్లు వేశారు.
Also Read:వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ సునీత సహా మరో ఇద్దరిపై ప్రైవేట్ కేసు
ఇకపోతే.. మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్య కేసులో ప్రైవేట్ కేసు వేసింది Deviredd Siva Sankar Reddy భార్య తులశమ్మ. ఈ విషయమై హైకోర్టులో వాదనలు జరిగాయి . వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డితో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి బావ మరిదిపైనా కేసు దాఖలు చేసింది.
దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ 17న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.