టీడీపీ దిశగా ‘‘ వసంత ’’ అడుగులు.. రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్లు దొరకని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ విషయంలో ఎక్కువగా వున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి , ఎమ్మెల్యేలు పార్థసారథిలు పార్టీలు మారేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా తిరిగి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా కార్యకర్తలు, అనుచరులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. 

ఇదిలావుండగా.. టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్‌ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూర్చుతున్నాయి. వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని దేవినేని అన్నారు. 2014లో ఆ గర్భ శత్రువుల దగ్గరికి పంపించినా పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశానని ఉమా గుర్తుచేశారు. కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలు తలా ఓ పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. 

Latest Videos

ALso Read: దేవినేని ఉమాకు , కృష్ణప్రసాద్‌కు వైరం ఎందుకొచ్చింది .. టీడీపీలో ‘‘ వసంత ’’ చేరితే బాబు వ్యూహమేంటీ..?

ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ల పనులు చేయించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరని ఉమా చెప్పారు. తనపై దాడులు చేశారని, చంపాలని చూశారని.. ఈనాడు బ్రతికి ఉన్నానంటే పార్టీ అధినేత, కార్యకర్తల బలమే కారణమన్నారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా.. లేదా చింతలపూడి కాలువల మీదైనా పడుకుంటానని దేవినేని ఉమా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

click me!