ఊపిరి వున్నంత వరకు జగన్‌తోనే.. 2024లోనూ వైసీపీ అభ్యర్ధిని నేనే , గెలిచేది నేనే : అనిల్ కుమార్ యాదవ్

Siva Kodati |  
Published : Jun 24, 2023, 02:56 PM IST
ఊపిరి వున్నంత వరకు జగన్‌తోనే.. 2024లోనూ వైసీపీ అభ్యర్ధిని నేనే , గెలిచేది నేనే : అనిల్ కుమార్ యాదవ్

సారాంశం

నెల్లూరు సిటీ వైసీపీలో గత కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్యెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లోనూ వైసీపీ తరపు నుంచి గెలిచేది తానేనని ఆయన స్పష్టం చేశారు. 

నెల్లూరు సిటీలో తనకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు తయారయ్యాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నిన్న తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత పనుల మీద తాను కొద్దిరోజులు నెల్లూరులో వుండటంతో కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేశారని అనిల్ ఆరోపించారు. వైసీపీకి తాను దూరంగా వుంటున్నానని ఓ వర్గం మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ఊపిరి ఉన్నంత వరకు తాను జగన్‌తోనే వుంటానని అనిల్ కుమార్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే వుందని.. ఇకపై ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో వుంటానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. 2024లోనూ వైసీపీ తరపున విజయం సాధిస్తానని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

కాగా.. అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. వారిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే, నెల్లూరు సిటీ  నియోజకవర్గం వైసీపీలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో స్థానిక ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్‌కు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. 

ALso Read: జగన్ గెటవుట్ అన్నా.. ఫాలోవర్‌గానైనా వుంటా, ఫేక్ వార్తలపై తేల్చేసిన అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌ కుమార్ యాదవ్‌, నూడా చైర్మన్ ద్వారకానాథ్‌లు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌కు దూరం అయ్యారు. రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లతో కూడా అనిల్‌కు సఖ్యత లేదు. ఇక,  రూప్ కుమార్ యాదవ్ అయితే ఏకంగా ప్రత్యేకంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలను అనిల్ కుమార్‌ యాదవ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడి నుంచి ఎటువంటి  స్పందన లభించలేదని  తెలుస్తోంది. 

మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్ష పదవిని అప్పగించింది. ఈ నియామకం సమయంలో అనిల్ కుమార్ యాదవ్‌ను పార్టీ  సంప్రందిచలేదని ఆయన వర్గం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ఒకరి బలహీనతలు మరొకరు  బయటపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu
Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu