నేనేం పాపం చేశాను.. శబరిమలైలో వావర్ స్వామి గురించి తెలుసా : బీజేపీ నేతలకు అనిల్ యాదవ్ కౌంటర్

By Siva KodatiFirst Published Nov 26, 2022, 8:22 PM IST
Highlights

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై అనిల్ స్పందించారు. 

అయ్యప్ప దీక్షలో వుండగా ముస్లిం టోపీ, కండువా ధరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. హిందూ సమాజానికి తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించారు అనిల్ కుమార్ యాదవ్ . అయ్యప్ప దీక్షలో వున్న తాను ఇతర మతాలను గౌరవిస్తే ఏదో పాపం , నేరం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు వావర్ స్వామిని దర్శించుకుంటారనే విషయం బీజేపీ పెద్దలకు తెలియదా అంటూ అనిల్ కుమార్ ప్రశ్నించారు. 

అటు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం దీనిపై స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజం పట్ల అనిల్ కుమార్ యాదవ్ తీరు సరికాదన్నారు. హిందూ సమాజానికి అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి .. ముస్లిం టోపీ పెట్టుకుని అనిల్ పాదయాత్ర ఎలా చేస్తారని వీర్రాజు మండిపడ్డారు. అలాగే నెల్లూరులో రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇదిలావుండగా.. నెల్లూరులోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్షలో వుండి ఇతర మతస్థుల ప్రార్థనా మందిరానికి వెళ్లడంపై వారు అభ్యంతరం చెబుతున్నారు. హిందువుల మనోభావాలను ఎమ్మెల్యే కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అనిల్ ఇంటికి చేరుకుని బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

ALso REad:ముదురుతోన్న అనిల్ యాదవ్ ‘‘అయ్యప్ప దీక్ష’’ వివాదం... క్షమాపణలకు సోము వీర్రాజు డిమాండ్

కాగా.. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటింటికి తిరిగారు. అయితే ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా వుండటంతో వారి మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తుల్ని అవమానించారని వారు మండిపడ్డారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని వారు చురకలంటించారు. 

click me!