
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై త్వరలో పరువునష్టం దావా వెయ్యనున్నట్లు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, డీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తనపై విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు.
తనతో పాటు, తన కుటుంబ సభ్యులకు ఎవరితోనూ వ్యాపార సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి తనపై చేస్తున్న నిరాధార ఆరోపణలు హేయమైనవంటూ విమర్శించారు. విజయసాయిరెడ్డి ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ-ప్రగతి ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టులతో ప్రమేయం లేదని ఖరాఖండిగా స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.