22 మంది ఎంపీలను ఇస్తే హోదా తేలేకపోయారు, వేధించేందుకేనా మీ ప్రభుత్వం: జగన్ పై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

By Nagaraju penumalaFirst Published Jul 8, 2019, 3:12 PM IST
Highlights

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష అనడంతో కరెంట్ కోతలు మెుదలయ్యాయని ఆరోపించారు. పట్టిసీమ నీరు ఆలస్యం కావడంతో ఖరీఫ్ సీజన్ ఇంకా మెుదలు కాలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. విత్తనాల పంపిణీపై సర్కారుకు సరైన ప్రణాళికలేకపోయిందని ఎద్దేవా చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు. తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. తప్పుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైయస్ జగన్ నుంచి ఏపీ ప్రజలు చాలా ఆశించారని వారి ఆశలకు అనుగుణంగా నడుచుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. 22 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విమర్శించారు. 

కేంద్రబడ్జెట్ లో ఏపీపై శీతకన్ను వేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంపై కనీసం స్పందించలేదని విమర్శించారు. 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష అనడంతో కరెంట్ కోతలు మెుదలయ్యాయని ఆరోపించారు. పట్టిసీమ నీరు ఆలస్యం కావడంతో ఖరీఫ్ సీజన్ ఇంకా మెుదలు కాలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. విత్తనాల పంపిణీపై సర్కారుకు సరైన ప్రణాళికలేకపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. 

ఇసుక పాలసీపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు పనిదొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావడం లేదన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా పాలన లేదని దుయ్యబుట్టారు. మరోవైపు రాష్ట్ర 
రాజధాని అమరావతి నిర్మాణం నిలిపివేశారని విమర్శించారు. అమరావతి భూ సేకరణలో కుంభకోణం జరిగిందంటూ ప్రజలను తప్పదోవపట్టించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరనోపించారు. 

అలాగే 

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పనులు ఆపివేయటంతో వేలాది మంది కూలీలకు పని లేకుండా పోయిందని విమర్శించారు. ఫలితంగా వారు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

ప్రజావేదిక కూల్చివేసి ఏదో సాధించామని వైయస్ జగన్ ప్రభుత్వం భ్రమలో ఉందన్నారు. ప్రజావేదిక కూల్చివేత వల్ల ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారని విమర్శించారు. 
చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేజగన్ కు లేదన్నారు. 

ఎన్నికల ప్రచారంలో, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ చెప్పినదానికి చేస్తున్నదానికి అసలు పొంతనలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ఆలోచిస్తోందని ధ్వజమెత్తారు. 


అసెంబ్లీ వ్యవహారాలు సరిగా జరగడం లేదన్న మాజీ స్పీకర్ కోడెల చంద్రబాబుని అవమానించేందుకే సభ నడుపుతున్నట్లుంది అని ఆరోపించారు. మరోవైపు బీజేపీలో చేరికలు కేవలం మైండ్ గేమ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

చివరి శ్వాస వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుని జైలుకు పంపిస్తామని బిజెపి నేతలు చెప్పటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శని విమర్శించారు కోడెల శివప్రసాదరావు. 

click me!