అచ్చెన్నాయుడి పరామర్శకు చంద్రబాబుకు నో పర్మిషన్

By telugu teamFirst Published Jun 13, 2020, 2:07 PM IST
Highlights

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తమ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. కరోనా నిబంధనల కారణంగా అనుమతి ఇవ్వలేమని వారు చెప్పారు.

గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి అనుమతి ఇవ్వడం లేదు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు చేసిన అభ్యర్థనను జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు. 

కోవిడ్ -19 నిబంధనల కారణంగా అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ఎవరికీ అటువంటి అనుమతులు ఇవ్వడం లేదని వారు గుర్తు చేశారు. కాగా, మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబుకు జీజీహెచ్ సూపరింటిండెంట్ సూచించారు. టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదు.  

ఇదిలావుంటే, ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి హెల్త్ బులిటెన్ విడుదలైంది. సుదీర్ఘ ప్రయాణం కారమంగా గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జిజీహెచ్ సూపరింటిండెంట్ సుధాకర్  చెప్పారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన అన్నారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు వట్టవచ్చునని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులను కొనసాగిస్తున్నామని డాక్టర్ సుధాకర్ చెప్పారు. షుగర్ సాధారణ స్థితిలోనే ఉందని అన్నారు. 

అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు. 

దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.  

click me!