ఏపీలో ఎంట్రీకి ఆంక్షలే: ఆ తర్వాతే లోనికి ప్రవేశమన్న డీజీపీ

By telugu teamFirst Published Jun 1, 2020, 10:54 AM IST
Highlights

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోకి నేరుగా ప్రవేశించడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. స్పందనలో బుక్ చేసుకున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి లోనికి అనుమతిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశానికి ఆంక్షలు కొనసాగనున్నాయి. స్వేచ్ఛగా రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించబోమని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. 

కరోనా వైరస్ పాజిటివ్ వస్తే ఆస్పత్రికి, నెగెటివ్ వస్తే ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. స్పందనలో బుక్ చేసుకున్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. అనుమతి తీసుకుని వచ్చినవారికి రాష్ట్ర సరిహద్దుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Also Read: విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి: రాష్ట్రంలో 3042కి చేరిన కరోనా కేసులు

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా పొందుగుల వద్ద తెలంగాణ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పోస్టును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోకి వస్తున్నవారికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కమాండ్ సెంటర్ లో పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు సడలింపులు ఇస్తూనే మరోవైపు కొన్ని ఆంక్షలను అమలు చేస్తోంది. 

click me!