సీఎం జగన్ కీలక నిర్ణయం: కౌలు రైతులకూ... రైతుభరోసా

By Nagaraju penumalaFirst Published Jul 6, 2019, 3:27 PM IST
Highlights


కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామన్నారు. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందన్నారు. ఇక విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ఓ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని జగన్ ను కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. కౌలు రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందనుందని స్పష్టం చేశారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శనివారం అగ్రికల్చర్‌ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలు రైతులకు రైతుభరోసా వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

అలాగే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే సీజన్ కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజున ప్రకటించనున్నట్లు జగన్ ప్రకటించారు. రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేయనునన్నట్లు జగన్ ప్రకటించారు. 

మరోవైపు ప్రతీనెల అగ్రికల్చరర్ మిషన్ సమావేశం ఉంటుందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.  

రైతులకు 9 గంటలు పగలు కరెంట్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా 60 శాతం ఫీడర్‌ల ఆధునీకరణ కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదని జగన్ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.  

కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామన్నారు. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందన్నారు. ఇక విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ఓ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని జగన్ ను కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలో రైతు సహకార సంఘాల ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించాలని సూచించినట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నామినేట్‌ చేసిన వ్యక్తులే రైతు సహకార సంఘాల సభ్యులుగా, నీటి సంఘాల సభ్యులుగా కొనసాగుతున్నారని వాటిని రద్దు చేసినా కొనసాగుతున్నారని నాగిరెడ్డి తెలిపారు.  

click me!