కోనసీమలో మొదలైన కోడిపందాలు... కఠిన చర్యలు తప్పవు : పందెం రాయుళ్లకు డీఐజీ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Dec 25, 2022, 4:30 PM IST
Highlights

సంక్రాంతి సీజన్ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ఊపందుకున్నాయి. దీనిపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిపందాలు ఆడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

సంక్రాంతి సీజన్ మొదలు కావడంతో గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కోడి పందెలు, వాటి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌లను పాలరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడి పందాలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నామని డీఐజీ తెలిపారు.

వీరిపై ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని.. రూ.5 లక్షల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ ఇస్తామని పాలరాజు పేర్కొన్నారు. అయినప్పటికీ పందాలకు పాల్పడితే ఈ మొత్తాన్ని సీజ్ చేసి.. వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కోనసీమ అల్లర్లకు సంబంధించి ఇంకా 50 మంది పరారీలో వున్నారని పాలరాజు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 251 మందిని అదుపులోకి తీసుకున్నామని... పరారీలో వున్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. 

ALso REad: స్వర్ణముఖి నదిలో దూకిన కోడిపందెంరాయుళ్లు: తిరుపతి జిల్లాలో ఒకరు గల్లంతు

ఇదిలావుండగా... సంక్రాంతి పర్వదినానికి ముందే  తిరుపతి జిల్లాలో  కోడి పందెలు ప్రారంభమయ్యాయి. పోలీసులను చూసిన పందెంరాయుళ్లు  స్వర్ణముఖి నదిలో  దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో  ముగ్గురు నదిలో ఈదుకొంటూ  ఒడ్డుకు  చేరుకున్నారు. ఒకరు మాత్రం గల్లంతయ్యారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద కోడి పందెలు నిర్వహిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు  కుమ్మరిపల్లె  వద్దకు చేరుకున్నారు.  పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన పందెంరాయుళ్లు వెంటనే స్వర్ణముఖి నదిలోకి పోలీసుల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.  ముగ్గురు నదిలో ఈదుకొంటూ  అవతలి ఒడ్డువైపునకు చేరుకున్నారు.  ఒకరు మాత్రం  నదిలో గల్లంతైనట్టుగా సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కోడి పందెలపై నిషేధం ఉంది.పందెల సమయంలో వందల కోట్లు చేతులు మారుతాయి. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  సంక్రాంతి సందర్భంగా కోడి పందెలు నిర్వహిస్తారు.

click me!