ఏలూరు వింతవ్యాధికి కారణమదే... మద్యం మత్తులో?: భూగర్భ జల శాఖ సంచలనం

By Arun Kumar PFirst Published Dec 11, 2020, 5:07 PM IST
Highlights

ఏలూరులో సరఫరా అవుతున్న మున్సిపల్ ట్యాప్ వాటర్ సాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు జరిపింది భూగర్భ జల శాఖ.

ఏలూరు నగరవాసులు గతకొద్ది రోజులుగా వింత వ్యాధితో ఆస్పత్రిపాలవుతున్న సంఘటన తెలిసిందే. ఈ వింతవ్యాధికి నీటి కలుషితమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. బాధితులు తాగిన నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉందని భూగర్భ జల శాఖ తేల్చింది. ఇదే అస్వస్ధతకు కారణమయి వుంటుందని అభిప్రాయపడింది. 

ఏలూరులో భూగర్భ జల శాఖ సాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఇందులో క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించింది. మున్సిపల్ ట్యాప్ వాటర్ సాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు జరిపింది. తాగు నీటిలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదు క్లోరిన్ ఉన్నట్లు గుర్తించింది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల సాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలను ప్రకటించింది భూగర్భ జల శాఖ.

ఇదిలావుంటే ట్యాంక్ వున్న ప్రాంతాల్లో మద్యం బాటిల్స్ గుర్తించారు అధికారులు. దీంతో మద్యం మత్తులో ఉద్యోగులు ఎవరయినా నీటిలో క్లోరిన్ అధికమోతాదు కలిపి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగుతోంది. 

ఇప్పటికే బాధిత ప్రాంతాల నుండి సేకరించిన నీటి నమూనాల్లో సీసంతో పాటు హెవీ మెటల్స్ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదిక తేల్చింది. నీటిలో సీసం ఉన్నట్టుగా మూడోసారి ఎయిమ్స్ నివేదిక తేల్చింది. శుక్రవారం మధ్యాహ్నమే ఎయిమ్స్ మూడో నివేదిక అందింది.

ఈ నీటిలో సీసంతో పాటు ఆర్గానో క్లోరిన్, డైక్లరో మిథేల్స్, డీడీడీ, డీడీటీ, డీడీఈ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదికలు గుర్తించాయి. బాధిత ప్రాంతాల నుండి 40 శాంపిల్స్ ను ఇటీవల ప్రభుత్వం ఎయిమ్స్ కు పంపిన విషయం తెలిసిందే. తుది నివేదిక కోసం మరోసారి 80 శాంపిల్స్ ను ప్రభుత్వం పంపింది.పాలు, నీటిని కూడ ఈ దఫా పంపింది.

బాధిత ప్రాంతాల్లోని కూరగాయాలు, కారం ఇతర ఆహార పదార్ధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ నివేదిక తేల్చింది. ఇవాళ సాయంత్రానికి ఇతర సంస్థల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

click me!