
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికకు (atmakur bypoll) సంబంధించి ఎన్నికల సంఘం (election commission) షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 23న పోలింగ్ జరగనుండగా.. 26న ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati Goutham reddy ) మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
మరోవైపు ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి (mekapati vikram reddy ) పేరును ప్రకటించాలని మేకపాటి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ సీటును గౌతమ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి అవకాశం ఇద్దామని మేకపాటి కుటుంబం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మేకపాటి ప్రతిపాదనకు సీఎం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతా భావిస్తున్నారు.
ఇక, విక్రమ్ రెడ్డి విషయానికి వస్తే.. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. గౌతమ్ రెడ్డిలాగే విక్రమ్ రెడ్డికి కూడా మృదువుగా మాట్లాడతారనే పేరు ఉంది. అన్న గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు విక్రమ్ రెడ్డి సిద్దమయ్యారు.