కరోనా నేపథ్యంలో విధుల నిర్వహణకు తనకు మాస్కులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వాలని అడిగినందుకు విస్సన్నపేటలో విద్యుత్తు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో నూజివీడులో లైన్ మెన్లు ఆందోళనకు దిగారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. మాస్కులు అడిగినందుకు విద్యుత్తు ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం బయటపడింది. కరోనా నేపథ్యంలో విధి నిర్వహణకు రక్షణ పరికరాలు అడిగాడనే ఆగ్రహంతో ఉన్నతాధికారులు అనిల్ కుమార్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేశారు.
అనిల్ కుమార్ కృష్ణా జిల్లా విస్సన్నపేటలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఇంటింటికీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు తనకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవ్వాలని కోరాడు. దాంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.
undefined
ఉద్దేశ్యపూర్వకంగానే తనను విస్సన్నపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అశోక్ కుమార్ సస్పెండ్ చేయించారని బాధిత ఉద్యోగి ఆరోపిస్తున్నాడు. అనిల్ కుమార్ సస్పెన్షన్ ను నిరసిస్తూ నూజివీడు విద్యుత్తు కార్యాలయం ఎదుట లైన్ మెన్లు ధర్నాకు దిగారు.
అశోక్ కుమార్ మీద పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అశోక్ కుమార్ మీద చర్యలు తీసుకుని సస్పెండయిన అనిల్ కుమార్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే తాము విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.