
మొత్తానికి ఎన్నికల కమీషన్లో కదలిక వచ్చింది. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోందంటూ ఎప్పటి నుండో వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గడచిన రెండు రోజులుగా టిడిపి కూడా వైసీపీపై అవే ఆరోపణలతో ఎదురుదాడి మొదలుపెట్టింది. రెండు పార్టీలూ ఎన్నికల కమీషన్ ముందు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. డబ్బుల పంపిణీకి సంబంధించి శుక్రవారం రాత్రి గాజులపల్లెమిట్ట వద్ద జరిగిన కంటైనర్ హై డ్రామా ఇందులో భాగమే అనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
అయితే, ఇన్ని రోజులు వైసీపీ ఫిర్యాదులపై స్పందించని ఎన్నికల కమీషన్ ఒక్కసారిగా కదిలింది. పరస్పర ఫిర్యాదుల ఆధారంగా ఇటు టిడిపి అటు వైసీపీ నేతలకు చెందిన కొన్ని ఇళ్ళపై దాడులు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుండి తెల్లవారు జామున వరకూ ఈ దాడులు కొనసాగాయి. చివరకు టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటితో పాటు ఏవి సుబ్బారెడ్డి తదితర ఇళ్ళపై దాడులు జరిగింది.
అదేవిధంగా వైసీపీ నేత, నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచనతో పాటు వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి బంధులు జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డి ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి. సరే, వీరి ఇళ్ళలో ఏమి దొరికిందన్న విషయాన్ని పక్కన పెడితే, దాదాపు నెలరోజులకు పైగా నంద్యాలలోనే పలువురు మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు మకాం వేసారు. వారంతా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని వైసీపీ ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తోంది.
శుక్రవారం రాత్రి పలువురు నేతల ఇళ్ళపై దాడులు చేసిన ఎన్నికల కమీషన్ అధికారులు మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు బసచేసిన హోటళ్ళు, గదుల వైపు మాత్రం తొంగి చూడకపోవటం గమనార్హం.