తూర్పుగోదావరికి వైజాగ్ దెబ్బ

First Published May 5, 2017, 7:32 AM IST
Highlights

మంత్రివర్గంలో సీనియర్ గా చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడున్నా జిల్లాకు ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. ఇక ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పేరుకు ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. జిల్లాలో మెజారిటీ ఎంఎల్ఏలు టిడిపి వాళ్లే అయినా జిల్లాకు మాత్రం ఉపయోగం కనబడటం లేదు.

 ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని’ అన్నట్లుగా తయారైంది తూర్పు గోదావరి జిల్లా పరిస్ధితి. వాణిజ్యపరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందటానికి అవాకాశాలు ఎన్నిఉన్నా జరగాల్సినంత అభివృద్ధి మాత్రం జరగటం లేదు. ఈ జిల్లాకు మంజూరైన ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా ఇతర జిల్లాలకు తరలి పోతున్నాయంటే అర్ధం ఏమిటి? ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతూ చేతలకు వచ్చేటప్పటికి మొండిచేయి చూపుతోందనే కదా? అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమకేమీ పట్టనట్లు కూర్చోవటంతో ప్రభుత్వ తరలింపును యధేచ్చగా చేసుకుపోతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన పెట్రో యూనివర్సిటీ మంజూరైంది. ఓఎన్జిసి నిక్షేపాలున్నాయి కాబట్టి పెట్రో యూనివర్సిటీ రాజమండ్రిలో ఏర్పాటవటం సబబే అనుకున్నారు. అయితే, అనుకున్నంత సేపు పట్టలేదు యూనివర్సిటీ విశాఖపట్నానికి తరలి వెళ్ళటానికి. అదేమంటే, ప్రజాప్రతినిధులెవరూ మాట్లాడటం లేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్టి) పరిస్ధితి కూడా దాదాపు అంతే.

రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పడితే మొత్తం జిల్లా అంతా అభివృద్ది జరుగుతుందని ప్రజా ప్రతినిధులకు తెలిసినా ఎవరు కూడా మాట్లాడకపోవటం గమనార్హం. కాకినాడలో జెఎన్టియు, నన్నయ్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుబంధంగా పరిశ్రమలేవన్నా ఏర్పడితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశించిన వారికి నిరాసే ఎదురైంది. ఐఐఎఫ్టికి రాజమండ్ర అనుకూలమని సెర్చ్ కమిటి నిర్ణయించినా సంస్ధ ఏర్పాటుకు అవసరమైన చొరవ మాత్రం కనబడటం లేదు.

పేరుకు జిల్లాలో ముగ్గురు ఎంపిలున్నారు. యనమల, నిమ్మకాయల లాంటి సీనియర్ మంత్రులున్నారు. అయినా ఏమాత్రం ఉపయోం కనబడటం లేదు. లాజిస్టిక్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ పార్క్, కొబ్బరి ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నా నేతల్లో చిత్తశుద్ది లేకపోవటంతోనే జిల్లా పారిశ్రామికంగా వెనకబడిపోతోందనే భావన అందరిలోనూ నెలకొంది.

మంత్రివర్గంలో సీనియర్ గా చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడున్నా జిల్లాకు ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. ఇక ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పేరుకు ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. జిల్లాలో మెజారిటీ ఎంఎల్ఏలు టిడిపి వాళ్లే అయినా జిల్లాకు మాత్రం ఉపయోగం కనబడటం లేదు.

ఇదే విషయమై డిజైన్ ఇన్పోవేషన్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ ఎ. గోపాలకృష్ణ మాట్లాడుతూ, పెట్రోయూనివర్సిటీ రాజమండ్రిలో ఏర్పడితే ఎంతో ఉపయోగమన్నారు. పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్ ఇక్కడ అపారంగా ఉందన్నారు. జెఎన్టియూలో పెట్రో వర్సిటీ తరగతులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

అలాగే నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ టేకి మాట్లాడుతూ, ఐఐఎఫ్టి ఏర్పాటుకు రాజమండ్రి అన్నివిధాల అనుకూలమన్నారు. ఏడాదికి వంద కోట్ల రూపాయల లావాదేవీలే జరిగే అవకాశం ఉందన్నారు. ఓఎన్జిసి, గెయిల్ లాంటి సంస్ధలు ఇక్కడే ఉన్నందున ఐఐఎఫ్టి కూడా ఇక్కడే ప్రారంభిస్తే జిల్లాకు ఎంతో ఉపయోగమన్నారు.

click me!