వల్లభనేని వంశీకి దుట్టా సెగ: 15 రోజుల్లో వచ్చే కబురుపై ఉత్కంఠ

By telugu teamFirst Published Aug 24, 2020, 9:05 AM IST
Highlights

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎదుర్కోవడానికి వైసీపీ నేత దుట్టా రామచందర్ రావు సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. వచ్చే 15 రోజుల్లో వైసీపీ కార్యకర్తలకు చల్లని కబురు చెప్తానని దుట్టా అంటున్నారు.

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభా నియోజకవర్గంలో ఇరు వర్గాల చిచ్చు వేడెక్కుతోంది. వల్లభనేని వంశీపై ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని వంశీ చేసిన ప్రకటన వారిద్దరికి ఆగ్రహానికి కారణమైంది. 

దానిపై దుట్టా రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో నడిచానని, తనకు 40 ఏళ్ల నుంచి వైఎస్ తో పరిచయం ఉందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ కుటుంబంతోనే ఉన్నానని, జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో కలిసి నడిచానని దుట్టా అన్నారు. 

గన్నవరం నియోజకవర్గంలో ఏ పనిచేసినా జగన్ తనను సంప్రదించే చేశారని, జగన్ ఏం చెప్పినా చేశానని ఆయన అన్నారు. వంశీ పదేళ్లు టీడీపీలో ఉండి వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని, ఇన్నేళ్లు వైసీపీలో ఉంది ఇందుకేనా అని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. 

యార్లగడ్డ వెంకట్రావుతో విభేదాలు లేవని, శివభరత్ రెడ్డికి పదవులు అక్కరలేదని, గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని దుట్టా రామచంద్రరావు అన్నారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు తనను ఏమీ చేయలేరని, వైసీపీ కార్యకర్తల మీద చేయి వేయాలంటే అది తన ప్రాణం పోయిన తర్వాతనే అని ఆయన అన్నారు.

వైసీపీ జెండా కప్పుకునే చచ్చిపోతానని, వైసీపీ కార్యకర్తలకు మరో 15 రోజుల్లో ఓ చల్లని కబురు చెప్తానని దుట్టా రామచంద్ర రావు అన్నారు. ఆ చల్లని కబురు ఏమిటనే ఉత్కంఠ గన్నవరం నియోజక వర్గంలో నెలకొంది. 15 రోజుల్లో ఏం జరగబోతుందనే చర్చ ప్రారంభమైంది. 

click me!