తన కొడుకు మరణానికి సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి హత్యకు గురైన డ్రైవర్ సుబ్రమణ్యం తల్లి నూకరత్న లేఖ రాశారు.
కాకినాడ: తన కొడుకు మరణానికి సంబంధించి CBI విచారణ జరిపించాలని డ్రైవర్ Subramanyam తల్లి Nukaratna ఏపీ డీజీపీ Rajendranath Reddy, ఏపీ సీఎస్ Sameer Sharma లకు శుక్రవారం నాడు లేఖ రాశారు. తన కొడుకు సుబ్రమణ్యం హత్య కేసు విచారణను స్థానిక పోలీసులు సరిగా చేయడం లేదని ఆ లేఖలో ఆమె ఆరోపించారు. MLC Anantha Babuను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె కోరారుKakinada పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని ఆమె ఆరోపించారు.
తన కొడుకు మృతదేహంపై గాయాల విషయాన్ని కూడా ఆ లేఖలో ఆమె ప్రస్తావించారు. డెడ్ బాడీపై 15 చోట్ల గాయాలున్నాయని శవ పంచనామా తెలిపితే, పోస్టుమార్టం నివేదికలో 27 చోట్ల గాయాలున్నట్టుగా తెలిసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఒక్కరే తన కొడుకును చంపారంటే తాను నమ్మడం లేదన్నారు. గత నెల 19వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు ఉపయోగించిన మొబైల్ ఏ సెల్ టవర్ల పరిధిలో ఉందో.. ఆ పరిధిలో ఇంకా ఎవరి మొబైల్స్ ఉన్నాయో పరిశీలించినా వాస్తవాలు తేలుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తన వద్ద పనిచేసిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఈ ఏడాది మే 23న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీ తీసుకొనేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. రిమాండ్ గడువు పూర్తి కావడంతో ఈ నెల 6న మరోసారి ఆన్ లైన్ లో జడ్జి ముందు పోలీసులు ఎమ్మెల్సీని ప్రవేశ పెట్టారు.ఈ నెల 20వ తేదీ వరకు ఎమ్మెల్సీకి రిమాండ్ ను పొడిగించారు జడ్జి.
also read:ఆయనో పెద్ద క్రిమినల్ ... వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయండి: గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు
ఈ ఏడాది మే 20వ తేదీన ఉదయం డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో సుబ్రమణ్యం డెడ్ బాడీని తీసుకొచ్చాడు. . డెడ్ బాడీని కారు నుండి బయటకు తీయాలని చెప్పాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుబ్రమణ్యం మరణానికి సంబంధించి కారణాలు చెప్పాలని కోరుతూ కుటుంబ సబ్యులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డు పడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వపరంగా అనంతబాబు కుటుంబానికి సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఆ తర్వాతే సుబ్రమణ్యం డెడ్ బాడీకి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టం నివేదికలో హత్యేనని తేలింది. మృతుడి ఒంటిపై గాయాలున్నట్టుగా వైద్యులు నిర్ధారించారు.
ఉద్దేశ్యపూర్వకంగా సుబ్రమణ్యాన్ని హత్య చేయలేదని ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో తెలిపారని కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు గత నెల 23న ప్రకటించారు. పద్దతి మార్చుకోవాలని కొట్టడంతో ఇంటి వద్ద ఉన్న గేటుకు తగిలి డ్రైవర్ సుబ్రమణ్యానికి గాయాలయ్యాయన్నారు. ఈ సమయంలో తనపై దాడికి యత్నించడంతో సుబ్రమణ్యాన్ని నెట్టివేయడంతో కిందదపడ్డాడని చెప్పారని ఎస్పీ వివరించారు. ఆసుపత్రికి తరలించే సమయంలోనే సుబ్రమణ్యం మరణించాడని ఎమ్మెల్సీ తమకు చెప్పాడని ఎస్పీ చెప్పారు. అయితే సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా చిత్రీకరించేందుకు గాను డంప్ యార్డ్ ప్రాంతానికి తీసుకెళ్లి కర్రతో కొట్టినట్టుగా ఎస్పీ చెప్పారు.ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కోరుతూ లాయర్లు ఈ నెల 1వ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.