ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. తాను తప్పు చేసి ఉంటే క్షమించాలని విచారణలో చెప్పినట్లు తెలిపారు.
నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్టినేటర్ వి. లక్ష్మణ రావు ముందు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎనస్తీషియా వైద్యుడు సుధాకర్ మంగళవారం హాజరయ్యారు.
సుధాకర్ వ్యవహారంపై వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ యు. రామకృష్ణరాజు ఆదేశాల మేరకు వి. లక్ష్మణ రావు శాఖాపరమైన విచారణ చేపట్టారు. తన విచారణలో భాగంగా లక్ష్మణ్ రావు ఆస్పత్రి సూపరింటిండెంట్ నీలవేణిదేవి, ప్రసూతి వైద్య నిపుణులు గౌతమి, అప్పట్లో సూపరింటిండెంట్ గా పనిచేసిన హెచ్.వి. దొర, జనరల్ సర్జన్ సింహాద్రి, వైద్యులు వైద్య సిబ్బందిని విచారించారు.
undefined
విచారణ తర్వాత లక్ష్మణ రావు మీడియాతో మాట్లాడారు. రూల్ నెంబర్ 20 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని డాక్టర్ సుధాకర్ మీద వచ్చిన అభియోగంపై, ఆయన ప్రవర్తనపై విచారణ జరిపినట్లు ఆయన తెలిపారు. విచారణ నివేదికను కమిషనర్ కు ఇస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ కూడా మీడియాతో మాట్లాడారు తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని, అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని ఆయన అన్నారు. తనకు తెలియక అాలా మాట్లాడానని విచారణ అధికారికి తాను చెప్పానని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆ రోజు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు ఆయన తెలిపారు.
డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి విశాఖపట్నంలో నడిరోడడుపై న్యూసెన్స్ చేశారనే ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.