
అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.
ఏపీ రాష్ట్ర రాజధానిని విశాఖకు మార్చేందుకు ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులను ఏపీ శాసనమండలి చైర్మెన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెలెక్ట్ కమిటీ పార్టీలు కూడ పేర్లను పంపాయి. కానీ, ఇంత వరకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రెండు బిల్లలు పరిశీలనకు గాను ఎనిమిది మంది సభ్యుల చొప్పున సెలెక్ట్ కమిటిలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసినా కూడ ఇంతవరకు సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేయలేదని ఆయన ఆ పిటిషన్ లో గుర్తు చేశారు.
సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేయాలని కూడ మండలి ఛైర్మెన్ ఆదేశాలు జారీ చేసినా కూడ కార్యదర్శి పాటించలేదని ఆయన ఆరోపించారు. అధికార పక్షానికి అనుకూలంగా మండలి సెక్రటరీ వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో ఆయన ప్రస్తావించారు.
ఈ కారణంగానే మండలి కార్యదర్శి పదవిని మరోసారి పొడిగించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ లో ప్రస్తావించారు. సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. శాసనమండలి కార్యదర్శి, శాసనమండలి సహాయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే ఛాన్స్ ఉంది.