కరోనా నాక్కూడా రావచ్చు, నయమయ్యే జ్వరంలాంటిదే: వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Apr 27, 2020, 6:47 PM IST
Highlights

కరోనా బాధితులను అంటరానివాళ్లుగా చూడకండి, తనతో సహా కరోనా ఎవరికైనా రావొచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నయమైపోయే జ్వరం లాంటిదేనని సీఎం అన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు

కరోనా బాధితులను అంటరానివాళ్లుగా చూడకండి, తనతో సహా కరోనా ఎవరికైనా రావొచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నయమైపోయే జ్వరం లాంటిదేనని సీఎం అన్నారు.

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో మందులను కూడా డోర్ డెలివరీ చేసే పరిస్ధితి తీసుకొచ్చామని జగన్ అన్నారు.

గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లతో కూడిన మంచి వ్యవస్థ ఉందని.. వీరంతా ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు సర్వే చేశారని సీఎం కొనియాడారు. క్లిష్ట సమయంలో మంచి సేవలు అందిస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లకు జగన్ ధన్యవాదాలు చెప్పారు.

సామాన్యులకు కష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... ఎంత చేసినా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయలేమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్ధితి ఎప్పటికీ ఉండదన్న ఆయన కోవిడ్ 19తోనే కలిసి జీవించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు వాస్తవ పరిస్ధితులు అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కష్ట సమయంలో ప్రతి పేద ఇంటికి రూ.1,000 సాయం అందించామని, ఇన్ని కష్టాలు ఉన్నా, పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని జగన్ గుర్తుచేశారు. కరోనాపై అనవసర భయాలకు ప్రజలు దూరంగా ఉండాలని, కరోనా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలుసుకోవడం కష్టమన్నారు. 

ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో 4 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించే పరిస్ధితి ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా జీవితం నాశనం అయిపోయిందని భావించొద్దని సీఎం చెప్పారు. గ్రీన్‌ జోన్లలో సాధారణ పరిస్ధితులు నెలకొనాలని, గ్రీన్ జోన్లలోకి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 
 

click me!